About The Telusa Logo

Contributed by Sri Chaganti Sambhu Prasad [ Silver Jubilee Issue 1997-98 ]

మీకు తెలుసా?

అవి తెలుగు సాహిత్య సమితి, చెంబూరు లో రూపు దిద్దుకుంటున్న తొలి రోజులు. మన సమితికి అందంగా ఉండే 'logo' ఉంటే  బావుంటుందన్న ఆలోచన ఎప్పుడూ కలుగుతూ ఉండేది. ఏదో పూర్ణకుంభం, దేవతావిగ్రహం కాకుండ, కొత్త తరహాగా ఉండాలనే ఉబలాటం ఉండడం వాళ్ళ, హైదరాబాదు వెళ్ళినప్పుడు సాహసం చేసి, ప్రఖ్యాతకార్టూనిస్టు, చిత్రకారులు శ్రీ మైదం చంద్రశేఖర్ గారి ఇంటికి వెళ్ళాను. ఆయన "చంద్ర " పేరుతో ప్రభ, పత్రిక, జ్యోతి, యువ, వార/మాస పత్రికలలో మనందరికీ పరిచితులు. ఇంత గొప్ప వ్యక్తిని మన సమితి లోగో వేసి ఇవ్వమని అడిగితే ఏమనుకుంటారో అనే భయంతో, తటపటాయిస్తూ, వచ్చిన కారణం విన్నవించుకున్నాను. ఆయన సాదరంగా ఆహ్వానిస్తూ, పది నిమిషాల్లో ఆరు బొమ్మలు వేసి చూపించి, వీటిలో ఏదైనా ఎంచుకోమన్నారు. అవన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి! ఏం చేయాలో తెలియక సతమతమవుతుంటే, ఆయన నా బాధ గమనించి, పువ్వుతో ఆహ్వానిస్తున్నట్లు ఉంటే బావుంటుందేమోనని సూచించారు. ఈవిధంగా మన సమితి లోగో తయారయ్యింది. తరువాత మన సమితి పత్రిక "తెలుసా" కి కూడా మాస్టారుగారే  లోగో వేసిపెట్టారు.  

శ్రీ చంద్ర గారు తన చిన్నతనం నుంచే చిత్రాలు, కార్టూన్లు వేయడంలో ప్రసిద్ధి చెందారు. ఫైన్ ఆర్ట్స్ లో డిప్లొమా చేసిన తరువాత కమర్షియల్ ఆర్టిస్టుగా కొన్ని వేల కథల పుస్తకాలకి, గేయలకి ఈయన బొమ్మలు వేశారు. విదేశాలలో కూడా తన చిత్ర కళాప్రదర్శనల ద్వారా బహుముఖ ప్రశంసలు అందుకున్నారు. చిత్రలేఖనం కాకుండా, కథలు వ్రాయడం లోకూడా శ్రీ చంద్ర గారు ప్రసిద్ధులు. ఉదారస్వభావులైన శ్రీ చంద్ర గారికి సమితి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ...

చాగంటి శంభూ ప్రసాద్ .