మన సంస్కృతి!

తెలుగు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రపు అధికార భాష. రాష్ట్ర ప్రభుత్వపు అంచనాల ప్రకారం ఏడున్నర దాటిన 'ఆరుకోట్ల' ఆంధ్రుల భాష. ఇది భారత దేశంలో హిందీ, బెంగాలీ తర్వాత అతి ఎక్కువ మంది మాట్లాడే భాష! మన చరిత్ర, చారిత్రాత్మక కట్టడాలు, జీవన శైలి, నృత్య, సంగీత , సాహిత్య, కళా విధానాలు, పండుగలు, పబ్బాలు వీటన్నిటి మేలు మిశ్రమమే మన సంస్కృతి. భాషనీ సంస్కృతినీ వేరు చెయ్యలేము కాబట్టి తెలుగు భాష ప్రాచీన్యతను మరియు ఔచిత్యాన్ని తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

జాతి, మత, వర్ణ, ప్రాంతీయ వ్యామోహాల వల్ల, చారిత్రకారులు భాష యొక్క చరిత్రను తమ తమ రంగుటద్దాలలో చూపించటం వల్ల ఈనాడు మనం చూస్తున్న, మనకు చూపించబడుతున్న నిదర్శనాల ఆధారంగా మాత్రమే మన భాష యొక్క (మరియు ఇతర భాషల యొక్క) గత చరిత్రను భరోసా పూర్వకంగా పునర్నిర్మించుకోలేము. ఏది ఎలాఉన్నా, మాట్లాడబడిన భాషకు, వ్రాయబడిన భాషకూ మధ్య సమయాంతరం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

శాతవాహన కాలంలో (క్రీ.పూ. 300) ఆదరించబడిన బౌద్ధ మత కట్టడాల ద్వారా మరియు ఇక్ష్వాక, పల్లవ రాజుల (క్రీ.శ. 300-600) కాలం లో కట్టబడిన హిందూ మత సంబంధితమైన కట్టడాల ద్వారా నిర్దుష్టమౌతున్నది ఏమంటే, అప్పట్లో వాడుకలో ఉన్నది బ్రాహ్మీ లిపి లో వ్రాయబడిన సంస్కృత, ప్రాకృత భాషలు. ప్రాంతీయ భాషలలో చోళ, చాళుక్య (క్రీ.శ. 600-1000) రాజుల కాలంనించి తెలుగు భాష యొక్క వ్రాతపూర్వకప్రయోగానికి ప్రాచుర్యం లభించినట్లు తెలుస్తోంది.

కృష్ణా, గోదావరీ నదుల మధ్య విలసిల్లిన వేంగీ రాజుల మొదలు, వరంగల్లు రాజధానిగా ఏలిన కాకతీయ రాజ్యం , కొండవీటి రెడ్డి రాజుల మధ్య, కవిత్రయం చేత మూడువందల సంవత్సరాల కాలావధిలో (1000-1300) అనువదించబడిన మహాభారత కావ్యం తెలుగు తనపు ఐక్యతకు తార్కాణం! పూర్తి దక్షిణాపథాన్ని ఏక ఛత్రాదిపత్యం గా ఏలిన విజయనగర సామ్రాజ్యపు (1300-1600) రాజు, శ్రీక్రిష్ణదేరాయల (1509-1530) చేత "లెస్స" అనిపించుకొన్న భాష మనది. బహుమనీ సుల్తానుల (1350-1550), మొఘలాయి చక్రవర్తుల (1526-1707) రాక తో మరింత వైవిధ్యతని ఏర్పరుచుకొన్న మత విధానాలు మన సంస్కృతికి మరోదిశ ని చేర్చాయి. ఇక ఈస్టు ఇండియా కంపెనీ (1600-1858), రవి అస్తమించని బ్రిటీషు సామ్రాజ్య(1858-1947) ప్రభావాన్ని చెప్పనే అక్కరలేదు. ఇది చరిత్ర లో చదువుకొనే పాఠం కాడు. చరిత్ర నేర్పిన పాఠం.

ఈనేపధ్యంలో, పండిత పామరులకు అర్థమయ్యేటట్లు "మందార మకరంద మాధుర్యమునఁ దేలు మధుపంబు వోవునే మదనములకు" అని సులభమైన శైలి లో పోతన, పురాణాలు వ్రాసుకోవటం పూర్తికావటం చేతనేమో, పోతన గారి సమకాలీనులైన తాళ్ళపాక అన్నామయ్య(1408-1503), ఆతరువాత భద్రాచల రామదాసు (1620 - 1688) కీర్తన లరూపంలో, తదుపరి గా కృతులకు, కర్నాటక సంగీతానికే మూల విరాట్టైన శ్రీ త్యాగరాజు (1767-1847) తమ భక్తి భావాలను అజరామయం చేసుకొన్నారు.

తర్వాతి రచనావ్యాసంగంలో కందుకూరి విరేశలింగం పంతులు గారి "రాజశేఖర చరితము", గురజాడ అప్పారావు గారి "కన్యాశుల్కం" లాంటి నవలలు సాంఘిక చైతన్యానికి సంభందించినవి. అదేవిధంగా, విశ్వనాధవారి వేయిపడగలు, సున్నితమైన నండూరి వారి వెంకిపాటలు, దేవులపల్లి కృష్ణ శాస్త్రి రచనలు, గుచ్చుకోనే శ్రీ శ్రీ గారి మహాప్రస్థానం, సూటి గా, నిర్మొహమాటంగా వ్రాసిన చలం గారి నవలలు తమవైన ఒక పంధాని ని 'సెట్' చేసాయి.

స్వతంత్ర భారత యుగంలో, నచ్చినవాళ్ళు ఎత్తోకుపోయి, నచ్చని వాళ్లు నాశనం చేయగా మిగిలిన చారిత్రాత్మక కట్టడాలు మన అసహాయ స్థితికి నిజ తార్కాణాలు. దిగంబర కవిత్వానికీ, పూర్తిగా ఊహా కల్పితమైన రచనలకీ వేయబడిన పెద్దపీటలు మన మారుతున్న సాంఘిక విలువల్ని వేలెత్తి చూపిస్తున్నాయి. మరింత వేగంగా పరుగులెత్తుతున్న ఆధునిక జీవనంలో, చూడడానికీ, చదవటానికీ సమయం లేక కాబోలు, అన్నిరకాలు గానూ కుదించుకుపోతున్న, మూడుగంటల వ్యవధిని దాటని చిత్ర ప్రదర్శనలు, 'చీటికి మాటికి చేయ్యేస్తూ, చుట్టూ కుర్రాళ్ళు' అని కంప్లైంట్ చేస్తూ కూడా ప్రతి అక్షరానికీ ఒక ఊరు వెళ్తున్న పాటలు, ఇదీ మన నేటి పరిస్థితి. సాంఘికంగా తమని తాము వెలివేసుకొంటున్న ప్రజానీకానికి 'emotional support' కోసంకాబోలు, ఎప్పటికీ అంతుకాని వింత కథలు, దూరదర్శక నేస్తాలు. దీనికి మనవాళ్ళు పెట్టుకొన్న పేరు, surrealism! మాముత్తాతలు తాగిన నేతిమూతులు, మాతాతలు వాసన చూసేసారు. ప్రజాస్వామ్యం లోని ప్రతి కీలుకీ పడుతున్న వాతలు మాత్రం మిగిలాయి.

కళళని, కళాకారుల్నీ చూసుకోవటానికి ఏమహారాజపోషకులూ లేని ఈరోజుల్లో, మన కంటూ ఒక వైవిధ్యతనిచ్చిన, అచ్చంగా మనవైన, సంగీత, నాటక, నాట్య, రచనా విశేషాలకు మన చేతనైనంత ప్రోత్సాహాన్ని ఇవ్వటమే మన భారతీయ సంస్కృతికీ, తెలుగు తల్లికీ మనం ఇవ్వగలిగిన 'నూలు పోగంత' సహాయం.

"దేశాభిమానం నాకుకద్దని
వట్టి గొప్పలు చెప్పుకోకోయ్,
పూని ఏదయినాను ఒక మేల్
కూర్చి జనులకు చూపవోయ్!"
- గురజాడ అప్పారావు.